Saturday, December 14, 2013

సచివాలయం..రణరగం

సచివాలయం..రణరగం


-పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత
-మిన్నంటిన తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలు
-రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు, దిగ్విజయ్ దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కిన సీమాంధ్ర ఉద్యోగులు

హైదరాబాద్, డిసెంబర్ 13 (టీ మీడియా):రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా సాగిపోతున్న ప్రస్తుత తరుణంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం సచివాలయ ప్రాంగణం తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. పరస్పర తోపులాటలు, వాగ్వాదాలతో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సీమాంధ్ర ఉద్యోగులు సీ బ్లాక్ ఎదుట ఆందోళన చేస్తూ, తెలంగాణ ఉద్యోగులు లోపలకు వెళ్లేందుకు దారివ్వకపోవడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఉద్యోగులు సంయమనం పాటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వారం రోజులుగా నిబంధనలకు విరుద్దంగా సచివాలయ ఆవరణలో లౌడ్ స్పీకర్లను వినియోగిస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం కేంద్ర మంత్రి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సచివాలయంలో ఊరేగించి నేలపై పడేసి తొక్కుతూ చెప్పులతో కొట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆంధ్రవూపదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లును కిందపడేసి కాళ్లతో తొక్కుతూ ప్రతులను చించివేయడం తీవ్ర ఉదిక్తతకు దారి తీసింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రోజూ మాదిరిగానే ఎల్ బ్లాక్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీగా బయల్దేరారు. రోజూవారీ నిరసనలకు భిన్నంగా దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీ బ్లాక్ వద్దకు చేరుకున్నారు.

సీ బ్లాక్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు దిష్టిబొమ్మను నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ చెప్పులతో కొట్టారు. అనంతరం మురళీకృష్ణ తన చేతిలోని కాగితాలను చూపుతూ ‘ఇది తెలంగాణ ముసాయిదా బిల్లు. దీంతో సీమాంవూధకు అన్యాయం జరుగుతోంది. ఈ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదో చిత్తు కాగితం.’ అంటూ బిల్లు ప్రతులను చించి నేలపై వేసి మహిళా ఉద్యోగులతో తొక్కించారు. అనంతరం చెప్పులతో ప్రతులను కొడుతూ తెలంగాణ వ్యతిరేక నినాదాలు చేశారు. అదే సమయంలో మధ్యంతర భృతిపై సీఎస్‌ను కలిసేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్‌లు సీమాంధ్ర ఉద్యోగుల తీరుకు నిరసనగా ప్రతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

సీఎస్‌ను కలిసేందుకు ముందుకు వెళ్తున్న టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు అడ్డుకుని, ఆయనను బయటికి వెళ్లిపోవాలని కోరారు. తాను సీఎస్‌ను కలిసేందుకు వచ్చానని, తనకు దారి ఇవ్వాలని శ్రీనివాస్‌గౌడ్ వారిని కోరారు. అప్పటికే సీ బ్లాక్ ఎదుట బారికేడ్లను దాటుకుని ప్రధానద్వారం వద్దకు చేరుకున్న సీమాంధ్ర మహిళా ఉద్యోగులు అక్కడ బైఠాయించారు. దీంతో టీ ఉద్యోగనేతలకు లోపలకు వెళ్లడం సాధ్యం కాలేదు. సీమాంధ్ర ఉద్యోగులు వెనుక్కు వెళ్లిపోవాలని సచివాలయ ప్రధాన భద్రతాధికారి పదేపదే చేసిన విజ్ఞప్తులను వారు ఖాతరు చేయలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణ వ్యతిరేక నినాదాల హోరు పెంచారు. ఇందుకు ప్రతిగా తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేస్తూ డప్పులు మోగించారు. సీ బ్లాక్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించిన ఉద్యోగినులు తమను మహిళా పోలీసులే పక్కకు తరలించాలని ఎవరూ తమను తాకవద్దని హెచ్చరిస్తూ బైఠాయించడంతో టీ నేతలు వెనుక్కు వెళ్లిపోయారు.

ధర్నా చౌక్‌గా మారింది: శ్రీనివాస్‌గౌడ్
సచివాలయం ధర్నాచౌక్‌గా మారిందని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు తాము వస్తే తనను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.మేం చాలా ఓపికగా ఉన్నాం.. మేమూ మీలా ప్రవర్తిస్తే ఒక్క నిమిషం చాలంటూ సీమాంధ్ర ఉద్యోగులను హెచ్చరించారు. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.